http://saamaanyudu.wordpress.com/feed

Syndicate content సామాన్యుడు * common man
(మీ మనసుతో సంభాషిద్దామని)
Updated: 57 min 57 sec ago

పద్మ అవార్డులలో కూడా మన వాటా ఇంతేనా??

Wed, 01/25/2012 - 08:17
ఈ రోజు ప్రకటించిన 109 పద్మా అవార్డులలో మన రాష్ట్రానికి కేవలం రెండు మాత్రమే వచ్చాయి..ఇందులో ఓ సోషల్ వర్కర్ డా.జి.మునిరత్నం, బాడ్మింటన్ క్రీడాకారుడు సయ్యద్ మహమ్మద్ ఆరిఫ్ లకు పద్మశ్రీలు దక్కాయి. మిగిలిన కేతగిరీలలో ఎక్కడా మనవాళ్ళు లేరు భారత రత్న ఈ ఏడాది లేదని తేల్చేసారు… సచిన్ కు వయసు కాస్తా ముదిరేంతవరకు ఆగుతారేమో..ఇంకెవరూ భారతరత్నలు ప్రస్తుతానికి లేరు…మన వాళ్ళకు లాబీయింగ్ చేయడానికి సమయం లేదు ఈ విషయంలోననుకుంటా…వీళ్ళ పదవులు కాపాడుకోవడానికె కాల్మొక్త బాంచెన్ అంటూ ఢిల్లీ యాత్రలు చేస్తేనే సరిపోతుంది కదా?? http://ibnlive.in.com/news/full-list-2012-padma-awards/224135-53.html
Categories: Middle

కొండ ఫలం

Thu, 01/19/2012 - 09:32

కొండ ఫలం
దళారి ఫలహారం….

వారి స్వచ్చతను
నిలువెల్లా గాయపరుస్తూ
సాగే వ్యాపారం…

ఇది ఏళ్ళుగా సాగుతున్న
శ్రమ దోపిడీవలయం…


Categories: Middle

ఏనుగును కప్పి ఏమార్చగలవా??

Sat, 01/14/2012 - 02:16
ఎన్నికల సంఘం నిర్నయాలు ఒక్కోసారి హాస్యాస్పదంగా అనిపిస్తాయి.. యూపీ ఎన్నికల సందర్భంగా మాయావతి పెట్టిన ఏనుగు బొమ్మలను కప్పి వుంచాలని ఆదేశాలు జారి చేసారు. అసలు ఆ ఏనుగుల బొమ్మలు కప్పడానికి ఎంత ఖర్చవుతుంది? కప్పినా అవి ఏనుగులవి అని జనానికి తెలియకుండా వుంటుందా?? మరి కప్పి ఎవరిని మభ్యపెట్టడానికి? వాటిని పూర్తిగా తొలగించే పని ముందుగా చేపట్టి వుండాల్సింది. అసలు ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలో వుంటే వారి నాయకుల పేర్లను పథకాలకు, వీదులు, నగరాలకు, ప్రభుత్వ భవనాలకు నామకరణం చేస్తూ ప్రభుత్వ వాహనాలపై ముద్రిస్తూ పోతూ ఆ తరువాత ఎన్నికలప్పుడు వాటిని కప్పి వుంచమనడం కంటే ప్రజా ధనంతో చేపట్టే కార్యక్రమాలకు రాజకీయ ప్రేరేపిత పేర్లను పెట్టడం నిషేధిస్తూ చట్టాన్ని చేసి అమలు చేయించాల్సిన బాధ్యత  ముందుగా చేపట్టాలి. లేకపోతే పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నట్టుగా వుంటుంది..
Categories: Middle

ఆంధ్రజ్యోతివారికి శ్రీలక్ష్మీతో లవ్ ఫైయిల్యూరా???

Tue, 01/10/2012 - 23:16

గత ఆరునెలలుగా చూస్తున్నా…ఆంద్రజ్యోతి పేపర్లో ప్రతిరోజూ ప్రధాన వార్తగా ముందుపేజీలో లేకపోతే ఎక్కడో ఓ చోట ఆమె ఫోటోతో కూడిన వార్త రాయకుండా లేరు. ఆమె ఒక్కతే ఈ కుంభకోణమంతటికీ కారణంలా ఆమెనే ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంటే ఈ సందేహమొచ్చింది.

రాజకీయ నాయకుల వత్తిడులకు లోను కాని అధికారులెవరైనా వున్నారా? పోనీ వత్తిడి చేయని రాజకీయనాయకులున్నారా?? తెలుగుదేశం పాలనా కాలంలో జరిగిన ఏలేరు కుంభకోణంలో పాల్గొన్న అధికారులు లేరా?? ఎన్నో అవకతవకలను కప్పిపుచ్చేస్తూ అధికారులు రాజకీయ నాయకులతో అంటకాగడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. ఒక్క శ్రీలక్ష్మితోనే మొదలు కాలేదు..తుదీ కాలేదు. మరి ఆంధ్రజ్యోతికి ఎందుకీ కక్ష ఆమెపై.. దేవాలయానికి వెళ్ళినా వెంటపడి అక్కడా వ్యంగ్యంగా రాతలు. జైల్లో భర్త కలిసినా వార్త. ఆమె తోటి ఖైదీలతో మాటాడినా వార్త. అసలు ఈ పత్రిక వార్తలు మరచి కథనాలు రాస్తూంది అన్నది నిజం కాదా??

ఒక మహిళ పట్ల ఈ రకమైన ప్రవర్తన కలిగి వుండటం ఏ జర్నలిజం. ఆమె తప్పు చేసినట్టు నిరూపితమైతే శిక్ష అనుభవిస్తుంది. ప్రస్తుతం జైల్లోనే రిమాండ్ లో వున్నారు కదా?? ఇంక మీ కథనాలతో ఆమె వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడం సమంజసమా??

 


Categories: Middle

400 రూ.లకు సం.ఐతే లక్షలకోట్లు తిన్నవారికెన్నాళ్ళు?

Wed, 01/04/2012 - 10:35

ఈ రోజు వార్త దినపత్రికలో ఈ వార్త చదివి ఆశ్చర్యమేసింది..

నాలుగువందల రూయల జేబు దొంగతనం చేసిన వ్యక్తికి ఓ ఏడాది  జైలు శిక్ వంద రూపా జరిమానాను వేసారు  విశాఖపట్టణంలో గౌరవనీయ స్థానిక మేజిస్ట్రేటు వారు.

మరి ఇన్ని లక్షల కోట్ల  కుంభకోణాలు చేసిన వారికి ఎన్నేళ్ళు శిక్ష ఎంత జరిమానా వేయాలి. ఏమిటో కడుపు జరక్కో, చిల్లర పనులకో ఆశ పడి జేబు కత్తిరిస్తే పాపం ఓ ఏడాది జైలు.

ఈ ఘరానా దొంగలకు  నిజంగా శిక్షపడుతుందా?? అరెస్టైనా జైలులోనూ ప్రత్యేక సౌకర్యాలు, అనారోగ్యం పేరుతో ఆసుపత్రులలో వైద్యాలు.. ఇదీ మన నేర శిక్షాస్మృతి…

ఉన్నోడికి మేసినంత.. లేనోడికి కడుపుమంట…


Categories: Middle

బోగస్ కిరణాలు

Tue, 01/03/2012 - 20:52

లక్షకొలువులు ఇచ్చేశాం అని సిఎం గారి ప్రకటన చూస్తే నవ్వొస్తోంది. ఈమధ్య ఈ యువకిరణాల ఉద్యోగాలపై గ్రామాలలోని యువకులు తామిచ్చిన కొలువులలో చేరారా లేదా అని విచారణకు గ్రామస్థాయి కమిటీలు వేసారు. నేనూ తిరిగా.. కానీ అందులో పేర్కొన్న కంపెనీలలో ఒక్కడు చేరలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారమే లేదు. అసలు ఆ జాబితాలో ఇచ్చిన పేర్లలో 5 శాతానికి మించి ఎవరూ ఆ ఊళ్ళలో లేరు. ఏ ఊరివారో తెలీలేదు. అది స్వయంగా జిల్లా ఎంప్లాయ్ మెంటు ఎక్స్చేంజీ వారిచ్చిన జాబితా. సెక్యూరిటీ గార్డు పోస్టులలో స్వంత ఖర్చులతో చేరిన వారి పేర్లుకూడా వీళ్ళు కలిపేసుకున్నారు. ఇది మా పరిశీలనలో తేలిన అంశం. ఎందుకయ్యా ఇలా జన్నాన్ని మోసగిస్తారు??


Categories: Middle

ఇది ప్రగతి విరామం..

Wed, 11/30/2011 - 10:45
మనిషి నోట్లోకి ఇంత ముద్ద దిగాలన్న
ఒకే ఒక్క ఆశతో
ఒంటిపై గుడ్డ కానరాకుండా
దప్పికగొన్న గొంతులో ఇన్ని నీళ్ళు కూడా
పోసుకోక ఎగసోప పడుతూ
ఉత్త చేతుల్తోనే ఆశగా లేని కరెంటు తీగల్ని
కలుపుతూ నేలమ్మ కడుపున నాలుగు
గింజలు పండించి నలుగురికీ
అన్నమై తాను తృప్తిగా తేన్చేందుకు
ఆరుగాలం నెత్తుటిని చెమటగా మార్చే
సత్తెకాలపు వాడు
నేడు
కన్నెఱ జేస్తూ తన నాగలి కఱును
గోడకు జారగిలబెట్టి పూన్చిన
ఎద్దులను కట్లు విప్పదీసి
బండి సీలలను ఊడబెరికి
నెత్తిన చుట్టిన తలపాగా విప్పదీసి
నడుముకు చుట్టి
బంద్ చేస్తున్నానింక
అని సమర శంఖారావం
పూన్చిన క్షణం
నువ్వూ నేనూ
మొఖం ఎక్కడ పెట్టుకుందాం??

సుఖమన్నది ఎరుగని
పిచ్చి నాగలి ఆకలిగా నేలపై
మోరజాపి జూస్తుంటే
ఆ నేలపై తిరుగాడే వాళ్ళకు
ఇంక మంచి జరుగుతుందా??

ప్రతిది తూనిక జేసి గాజు గోళాల మధ్య
జరిగే సత్తు వ్యాపార కూడళ్ళలో
నువ్వు ఆబగా నాకే విదేశీ పాచి వాసన
నీ ముక్కు రంధ్రాలకు సోకడం లేదంటే
శాపగ్రస్తుడెవ్వడో బోధపడలేదా??

చిరుగు పాతలే నీ మానాన్ని
కాపాడే ఎరగా నీ కళ్ళముందు తెరలు తెరలుగా
కదలాడుతుంటే నీవమ్మేసిన అమ్మతనం
ఇంక నీకు కానరాలేదంటే ధృతరాష్ట్రుడెవడో
ఎరుకపడలేదా???

బుడబుక్కల వారిలా వేషాలేస్తూ
రోజుకో నెరవేరని హామీల నేతి బీరకాయల్ని
గుప్పిస్తూ కుప్పిగంతులేస్తున్న వాడ్ని చూసి
వాడి ముఖాన ఖాండ్రించి ఉమ్మడానికి కూడా
అసహ్యమేస్తుందన్నది నిజం

ఇది పంటకు విరామం కాదు
జాతి ప్రగతికి విరామం..విలోమం….

Categories: Middle

షర్మిళకు మద్ధతు తెలుపుదాం

Sat, 11/05/2011 - 13:33

ఈశాన్య రాష్ట్రాలలో అమలు కాబడుతున్న ప్రత్యేక సైనికాధికార చట్టానికి వ్యతిరేకంగా గత పదకొండేళ్ళుగా పోరాడుతున్న ఇరోం షర్మిళకు మద్దతు తెలుపుదాం.. కృత్రిమంగా ఆహారాన్ని సరఫరా చేస్తూ నిర్బంధాన్ని అమలు చేస్తున్న రాజ్యహింసకు వ్యతిరేకంగా మేధావులు ప్రజాస్వామిక వాదులు విరివిగా కదలి రావాలసిన అవసరముంది. అన్నా హజారే దీక్షకు మద్ధతుగా కదిలిన జనం, రాజకీయ పార్టీలు గత పదకొండేళ్ళూగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న షర్మిళ పట్ల అనాగరికంగా కిమ్మనకుండా వుండటానికి ఓటు బ్యాంకు రాజకీయాలు తో పాటు ఒకే తానులోని గుడ్డలైన రాజకీయ వర్గాలు ఈ విషయంలో మౌనం దాల్చడం నేరం.. కౄరమైన చట్టాలను ప్రయోగిస్తూ పౌరుల హక్కులను హరించి వేస్తున్న పాలక వర్గాలన్నీ ఒకటిగానే కనిపిస్తున్నాయి. దీనికి మీడియాకూడా వంత పాడుతున్నాయి. సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న షర్మిళ పోరాటానికి మద్ధతు తెలుపుదాం.. AFSPA  ను తక్షణమే రద్దు చేయాలని గొంతు కలుపుదాం..


Categories: Middle

మండుతున్న గుండె

Sat, 10/15/2011 - 11:30

బీడైన నేల

ఆరిన కంటతడి

చూపుకందని మేఘం

మొలకరాని విత్తు

మాటపెగలని గొంతు

మండుతున్న గుండె


Categories: Middle